బెంగళూరులో కోగంటి సత్యం అరెస్ట్...బెజవాడకు తరలింపు
విజయవాడలో యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యలో ఏ-2 గా విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను అరెస్ట్ చేశారు. నిన్న వ్యాపారం నిమిత్తం బెంగళూరు వెళ్ళిన కోగంటి సత్యంను ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. అక్కడే ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు.
రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం ను ఏ 2 గా ప్రస్తావించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి నేడు ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకు వస్తున్నారు. కోగంటి సత్యంను బెంగళూరు దేవనహళ్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, ఇక్కడ విచారణకు ఆయన్ని ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకు వస్తున్నారు.
రాహుల్ హత్య కేసులో ఏ1 గా ఉన్న మాజీ కార్పొరేటర్ కోరాడ విజయకుమార్ ఒక సిలిండర్ ఫ్యాక్టరీలో రాహుల్ కి పార్టనర్. తన వాటా సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరాడ రాహుల్ ని ఏడాదిన్నరగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే, దానికి రాహుల్ అంగీకరించకపోవడంతో, ఫ్యాక్టరీని మొత్తంగా కోగంటి సత్యంకు అమ్మాలని ఒత్తిడి చేశారు.
తాను దీనిపై బేరం చేశా కానీ, ఎక్కువ ధర చెప్పడంతో కొనలేదని, ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం వాదిస్తున్నారు. కానీ, రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కోగంటి సత్యంను ఏ2 గా నమోదు చేసి అరెస్ట్ చేశారు.