గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (22:34 IST)

60 వేల కోట్లతో కృష్ణా-గోదావరి అనుసంధానం

కృష్ణా-గోదావరి అనుసంధానంపై..రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పోలవరం నుంచి 60 వేల కోట్ల వ్యయంతో రోజుకి 2 టీఎంసీల గోదావరి జలాలు తీసుకెళ్లాలని యోచిస్తోంది.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించి అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కి నీటిని తరలించాలని ప్రతిపాదిస్తోంది. గోదావరి–కృష్ణా అనుసంధానంలో మరో బృహత్తర పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

సముద్రంలోకి వృథాగా పోతోన్న గోదావరి జలాలను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా నూతన ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో అధికారులతో సీఎం జగన్ తన ఆలోచనను వెల్లడించారు.

పోలవరం వద్ద ఉన్న గోదావరి జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించేందుకు డీపీఆర్​ తయారు చేయాలని ఆదేశించారు. 210 టీఎంసీలు తరలించాలని! గోదావరి ద్వారా వేలాది టీఎంసీల నీరు ఏటా సముద్రంలో వృథాగా కలసిపోతోంది.

ఈ నీటిని రోజుకు 2 టీఎంసీల నీరు చొప్పున మొత్తంగా 210 టీఎంసీలు తరలించాలన్నది సీఎం ఆలోచన. తద్వారా నాగార్జున సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని... రెండో దశలో ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తున్నారు.

అదే విధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ప్రతిపాదన.