శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:07 IST)

ఆళ్లగడ్డ జిల్లా కోర్టు సంచలన తీర్పు! అయిదుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు

క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో 2013లో జరిగిన హత్య కేసులో ఆళ్లగడ్డ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భీమునిపాడు గ్రామానికి చెందిన దుత్తల నరసింహారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డి. అమ్మన్నరాజా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
2013వ సంవత్సరం మే 10 న కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన దుత్తల నరసింహారెడ్డి, వీరారెడ్డి లు మోటార్ సైకిల్ మీద నంద్యాల నుంచి భీమునిపాడు కు వస్తుండగా, రేవనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కలుగొట్ల గ్రామ సమీపంలో ప్రత్యర్ధులు బొలెరో వాహనంతో వెనకవైపు నుంచి వారు ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ ను ఢీ కొట్టారు. అనంతరం దుత్తల నరసింహారెడ్డి ని కత్తులతో నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి రేవనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మొత్తం ఏడు మంది పై పోలీసులు కేసు నమోదు చేయగా ఆరికట్ల రామసుంకి రెడ్డి కి ఈ కేసుతో సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆరు మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 
 
కేసు విచారణ దశలో సుధీర్ రెడ్డి అనారోగ్య కారణంతో మృతి చెందాడు. దీంతో హత్య కేసులో ఉన్న ఆరికట్ల చిన్న సుంకిరెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, సుబ్బరాయుడు, బాలస్వామి లపై నేరం రుజువు కావడంతో ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.అమ్మన్న రాజా సోమవారం ఐదు మంది ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష అలాగే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అనంతరం ముద్దాయిలను ఆళ్లగడ్డ సబ్ జైల్ కి తరలించారు. ఐదు మంది కి జీవిత ఖైదు విధించడంతో భీమునిపాడు గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.