ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:07 IST)

సచివాలయం మార్పు కోసం దెయ్యాన్ని సృష్టించారు.... ఎక్కడ?

ఓ గ్రామ సచివాలయాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చేందుకు అందులో పని చేసే గ్రామ వాలంటీర్లు దెయ్యం కథను అల్లారు. అంతేనా.. పై అధికారులను కూడా నమ్మించి తమ పంతం నెగ్గించుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 14వ వార్డు కార్యాలయం హాజీనగర్ కాలనీలో ఏర్పాటుచేశారు. మున్సిపాలిటీలోని 12, 13, 14 వార్డుల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రారంభించారు. 
 
అయితే, ఈ కార్యాలయం బస్టాండుకు కిలోమీటరున్నర దూరంలో ఉంది. పైగా, ఇక్కడ పని చేసే వారంతా కర్నూలు నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్ దూరం కావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోందని, సమీపంలోకి కార్యాలయాన్ని మార్చాలని అధికారులను పలుమార్లు కోరారు. కానీ, వారు అది సాధ్యపడదని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. 
 
ఈ క్రమంలో వార్డులో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఈనెల 9వ తేదీన గుండెపోటుతో చనిపోయాడు. అంతే దెయ్యం కథ అల్లేశారని సమాచారం. కార్యాలయంలో ఏదో ఆకారం కదులుతూ కనిపిస్తోందని, తమకు భయం వేస్తోందంటూ వీరు అధికారుల వద్ద వాపోవడంతో ఉన్నతాధికారులు కార్యాలయం మార్పునకు సమ్మతించారు. 
 
ఫలితంగా గత మూడు రోజులుగా ఈ కార్యాలయం శివశంకర్ టాకీస్ పక్కకు మార్చినట్లు బోర్డు వేలాడుతుండడంతో స్థానికులు దెయ్యం  కథపై చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి వద్ద ప్రస్తావించగా దెయ్యం భూతం కథలేవీ తమ దృష్టికి రాలేదని చెప్పారు. అక్కడి వార్డు సచివాలయం మేడపై ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది తెలియజేయడంతో మార్పునకు అంగీకరించినట్లు చెప్పారు.