శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (20:25 IST)

జగన్‌కు షాక్.. వైకాపాలో మరో వికెట్.. ఆ 3 కారణాల వల్లే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలోకి?!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో వికెట్ పడనుంది. వైకాపా నుంచి టీడీపీకి జంప్ అయ్యే ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న ఏపీలో జ్యోతుల నెహ్రూ పార్టీని వీడితే, తెలంగాణలో వైకాపా అధ్యక్షుడు పొంగులేటి తెరాసలో చేరి షాకిచ్చారు. దీంతో తెలంగాణలో షట్టర్ క్లోజ్ చేసుకున్న వైకాపా.. ఏపీలోనూ తన పార్టీ కార్యాలయానికి తాళం వేసేందుకు రెడీ అవుతోంది. 
 
ఎందుకంటే..? వైకాపా నుంచి టీడీపీలోకి చేరే నేతల సంఖ్య పెరుగుతుండటంతో.. ఏపీలోనూ జగన్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా వైకాపా మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. శనివారం కర్నూలులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అందరిలాగానే అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని.. డబ్బు కోసం కాదని మోహన్ తెలిపారు.
 
పార్టీ మారడానికి వైకాపా అధినేత జగన్ వైఖరే కారణమని చెప్పారు. మొన్నటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిన నేపథ్యంలో భవిష్యత్తులో భూమా అఖిలప్రియపై ఎస్వీ మోహన్ రెడ్డి చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధినేత జగన్... మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. 
 
ఇంకా తన చెల్లెలు కుమార్తెపై తామే పోటీకి దిగాలని జగన్ కోరడంతో బాధేసి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇంకా కర్నూలులో ఈ నెల 16 నుంచి జగన్ చేపట్టే దీక్ష గురించి మోహన్ రెడ్డితో జగన్ ఒక్క మాట కూడా చెప్పలేదని, ప్రజా ప్రతినిధిగా ఎన్నికై రెండు సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదనతో తెలుగుదేశం పార్టీలో మారుతున్నట్లు మోహన్ రెడ్డి వెల్లడించారు.