గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:00 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. జగన్‌కు జనాదరణ తగ్గలేదని... ఆయనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని కానీ 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఘనవిజయం సాధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు జగన్ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారన్నారు. ఐతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తాను చెప్పలేనన్నారు. 
 
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కేవీపీ.. జగన్‌కు పాజిటివ్‌గా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ నేతగా మాట్లాడారా..? లేక వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా మాట్లాడారా అనేది చర్చనీయాంశమైంది.
 
ఇదిలా ఉంటే ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఉత్తమ సీఎంగా జగన్ ర్యాంక్ భారిగా పడోయింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న జగన్ పై ఏడాది తిరక్కుండానే 16వ స్థానానికి పడిపోయారు. జనంలో ఆయనపై 19 శాతం మేర వ్యతిరేకత పెరిగిందని ఆ సర్వే చెప్పింది. ఐతే జగన్ గ్రాఫ్ ఇలా అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను ఇండియా టుడే వెల్లడించలేదు. 
 
కేవలం జగన్ పై ఏపీలో 11 శాతం మేర వ్యతిరేకత పెరిగిందని మాత్రమే చెప్పింది. గత సర్వేతో పోలిస్తే సొంత రాష్ట్రంలో జగన్ కు 19శాతం ఆదరణ తగ్గినట్టు ఆ సంస్థ ప్రకటించింది. జాతీయ స్థాయిలో 5 శాతం ఆదరణ తగ్గినట్టు పేర్కొంది.