శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (11:29 IST)

కూలిన ఇంద్రకీలాద్రి కొండ చరియలు.. వాహనాలు ధ్వంసం.. స్తంభించిన ట్రాఫిక్..!

తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం ఉదయం ఈదురుగాలులు, పిడుగులతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలుచోట్ల చెట్లు, పూరిళ్లు నేలకూలాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒక్కసారిగా కుండపోత వర్షం కురవగా, విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ చరియలు విరిగి పడ్డాయి. హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలో జాతీయ రహదారిపై చరియలు విరిగిపడ్డాయి.
 
ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న వాహనాలపై బండలు పడడంతో, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై పడిన కొండ చరియలను తొలగించే చర్యలు చేపట్టారు.