శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (18:28 IST)

సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా

తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా  దాఖ‌లైంది. 

ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు.

సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019  అక్టోబ‌ర్ 22న ``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019  అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు.

దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది. దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు.

ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు.

దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.