ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (08:43 IST)

రివర్స్ టెండరింగ్‌ తో నష్టమే.. జగన్ సర్కార్ కు జైన్ లేఖ

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
 
పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విధానానికి శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. శనివారం నుండి టెండర్ ప్రక్రియ కొనసాగించనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్న నిర్ణయాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆ పార్టీ నేతలు, మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు.
 
ఈ తరుణంలో ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ చేస్తామని  సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలను కూడ విడుదల చేశారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల నష్టమని పీపీఏ అభిప్రాయడింది. శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు.
 
ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడ ఇదే విషయాన్ని చెప్పింది. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే రివర్స్ టెండరింగ్ వద్దని పీపీఏ సూచించింది. ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ కోరారు.
 
కేంద్రం ఒక నిర్ణయం తీసుకొనేవరకైనా రివర్స్ టెండరింగ్ విధానాన్ని నిలిపివేయాలని ఆయన సూచించారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
సకాలంలో ప్రాజెక్టు పూర్తికాకపోతే ఆ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనాలు అందకుండా పోతాయని ఆయన చెప్పారు.ఈ నెల 13వ తేదీన తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ కాపీని కూడ ఈ లేఖతో ఆయన జత చేశారు.