బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (16:47 IST)

వైకాపా నేతల అండతో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ : వీఆర్వోపై వేటు!!

machilipatnam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల అండతో అధికారులు చేయని తప్పులంటూ లేవు. వైకాపా నేతలు చెప్పినట్టుగా గంగిరెద్దుల్లా తలాడించారు. ఇపుడు చిక్కుల్లో పడుతున్నారు. చేసిన తప్పులకు శిక్షలు అనుభవించే పరిస్థితి తలెత్తింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత ఐదేళ్ళుగా తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కింది నుంచి పైస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 
 
తాజాగా మచిలీపట్నంలో వైకాపా నేతల ప్రోద్బలంతో నకిలీ ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన వ్యహారంలో వీఆర్వో శ్రీదేవిపై సస్పెన్షన్ వేటుపడింది. ఈమె మచిలీపట్నంలో 11వ వార్డు డివిజన్ వీఆర్వోగా పని చేస్తున్నారు. ఇటీవల మచిలీపట్నంలో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం వెలుగు చూసింది. హద్దులు, సర్వే నంబర్లు లేకుండానే ఇళ్ల పట్టాలు సిద్ధం చేసి, పంపిణీ చేశారంటూ ప్రచారం జరిగింది. 
 
దీనిపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో 11వ డివిజన్ వీఆర్వో శ్రీదేవి పాత్ర ఉందని అధికారులు నిర్ధారించారు. రాజకీయ పార్టీ నేతల ప్రోద్బలంతోనే పట్టాలు రూపొందించినట్టు ఆర్డీవో వాణి వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు వీఆర్వో శ్రీదేవిని సస్పెడ్ చేసినట్టు అధికారులు తెలిపారు.