శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:56 IST)

దళిత యువకుడి మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసు!!

చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ దళిత యువకుడు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోలీసులు నోటీసులు పంపించారు. మదనపల్లె డీఎస్పీ పేరుతో ఈ నోటీసులు జారీచేశారు. 
 
ఇటీవల పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు బండకాడపల్లి దళితవాడలో ఓం ప్రతాప్ అనే యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. అయితే, అధికార వైకాపాకు చెందిన నేతల వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ దారుణానికి మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాయడం తెలిసిందే.
 
ఈ లేఖపై చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు స్పందించి, చంద్రబాబుకు నోటీసులు పంపించారు. సీఆర్పీసీ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ స్పష్టం చేశారు.
 
కాగా, ఒక దళిత యువకుడు ఎందుకు అనుమానాస్పదంగా మృతి చెందాడో తెలుసుకోవాల్సిన పోలీసులు... ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలంటూ నోటీసులు జారీచేయడం విడ్డూరంగా ఉందని తెదేపా నేతలు అంటున్నారు.