గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... నెల్లూరులో ఆటోను ఢీకొన్న పాల వ్యాను
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
మృతులంతా బాధితులు అంగన్‌వాడీ కేంద్రంలో వంటపని చేసేవారుగా గుర్తించారు. ఘటనా స్థలంలోనే 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు - ముంబై జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతిచెందిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), ఎం.శీనయ్యగా గుర్తించారు.
కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ 14 మంది ఆటో ఎక్కబోతుండగా వెనకవైపు నుంచి వచ్చిన వ్యాను ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందటంతో పాటు వ్యాను డ్రైవరుతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డి పాలెం సీఐ సురేష్ బాబు, సంగం ఎస్‌ఐ కె. శ్రీకాంత్ ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే, హైదరాబాద్, పెద్ద అంబర్‌పేట వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.