శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 8 జూన్ 2017 (22:10 IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా సంకల్పం-2017, ప్రజలే ముందు...

మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహా సంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలనే ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి, తలసరి ఆదాయం లక్షా 47 వేల రూపాయిలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రప

మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహా సంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలనే ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి, తలసరి ఆదాయం లక్షా 47 వేల రూపాయిలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రపంచానికే తలమానికంగా వుండేలా మన ప్రజా రాజధాని నగరం అమరావతిని నిర్మించుకోవాలనే మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను.
 
మన ఆడపడుచులకు పొగచూరు లేని వంటిళ్లు సమకూర్చాలన్న గత ఏడాది సంకల్పాన్ని సాధించగలగడం మన ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనంగా భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి ఐదు సంవత్సరాలకు రెండింతలు పెంచడానికి, వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల, రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతానని, పండ్ల తోటల పెంపకం పెద్దఎత్తున చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రల నుంచి కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను.  
 
రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం నుండి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు పారించుకోవడం మన లక్ష్యంగా స్వీకరిస్తున్నాము. నిర్మాణంలో ఉన్న వంశధార, తోటపల్లి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గుండ్లకమ్మ, పురుషోత్తపట్నం, వెలిగొండ, ముచ్చుమర్రి, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటిదశ ప్రాజెక్టులను వచ్చే ఏడాదికల్లా పూర్తిచేసుకోవాలనే మహాసంకల్పాన్ని చేస్తున్నాను. 
 
ఇరవై వేల చెక్ డ్యాములను నిర్మించి, నాలుగు లక్షల పంటకుంటలను తవ్వి వానాకాలం ముందు 8 మీటర్లు, వానలు పడ్డ తరువాత 3 మీటర్లలో భూగర్భ జల మట్టాలు సాధించడం మన లక్ష్యం. నదుల అనుసంధానంతో పాటు సమర్థ నీటి నిర్వహణ చేపట్టి నా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మలచుకుంటాననే మహా సంకల్పాన్ని చేస్తున్నాను.
 
ఏడాదిలో నావంతుగా కనీసం పదిమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారికి డిజిటల్, ఫిజికల్ లిటరసీలను కల్పిస్తాను. 2019 నాటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడమే కాక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి ఫర్నిచర్‌ను సమకూర్చడమే లక్ష్యంగా స్వీకరిస్తున్నాను. 2018 నాటికి మన పాఠశాలలన్నింటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ తరగతులను ఏర్పరచడం మన లక్ష్యం. ఓపెన్ స్కూల్,  ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ప్రతి వ్యక్తి నిరంతర విద్య అభ్యసిస్తూ మన జన్మభూమిని జ్ఞానభూమిగా తీర్చిదిద్దడం మన ధ్యేయం. 
 
సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి, నిలవ, పొదుపు కోసం ప్రపంచంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను వినియోగించి ప్రభుత్వం చేపట్టే రెండవ తరం విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ ఛార్జీలు తగ్గేందుకు జరిగే కృషికి సహకరిస్తాను. రాష్ట్రంలో ఈ ఏడాది మరో ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం, అన్ని పంచాయతీ కార్యాలయ భవనాలు, పాఠశాల భవనాల నిర్మాణాన్ని పూర్తిచేయడం మన లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. మరో నాలుగు వేల పంచాయతీలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఉద్యమానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. 
 
వనం-మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పది మొక్కలు నాటి మొత్తం 50 కోట్ల మొక్కలతో 2018 నాటికి 30 శాతం పచ్చదనం సాధించేందుకు శ్రమిస్తాను. తెలుగుభాష, సంస్కృతులను కాపాడుకుంటూ, కూచిపూడి వంటి వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టి  గ్రామీణ మరియు ఆధునిక క్రీడలను ప్రోత్సహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే వాతావరణం కోసం కృషిచేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. ప్రపంచ సంతోష సూచికలో మరింత ఉన్నత ర్యాంకు సాధించడం మన లక్ష్యం.
 
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని విలువలతో కూడిన అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణశుద్ధిగా శ్రమిస్తాను. జూన్ 2018 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు, కార్యాలయాలకు ఆన్‌లైన్ సేవలందించే సామర్ధ్యాన్ని కల్పించడమే ధ్యేయంగా స్వీకరిస్తున్నాను.
 
ఈ సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమస్థానాన్ని సాధించడమే కాక జాతీయస్థాయిలో అనేక అవార్డులు అందుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ 2018 నాటికి ఈ అంశాలలో మన ప్రగతిని మరింత వేగవంతం చేసుకునేందుకు కృషిచేస్తాననే మహాసంకల్పం చేస్తున్నాను. 
 
‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని మనకు ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం. ఆ సందేశం నుంచి స్ఫూర్తిపొందుతూ ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రజలందరికీ అందించి, పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ప్రశాంత, సురక్షిత, ఆనందదాయకమైన సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకునే మహాయజ్ఞంలో మన మంత్రం- ‘ప్రజలే ముందు’.