మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (11:48 IST)

అతనికి ఇసుకే ఆహారం... ఎక్కడ?

ఆయన పేరు కోటేశ్వర రావు. సొంతూరు ప్రకాశం జిల్లా కలసపాడు గ్రామం. ఇతనికి ఆహారం కేవలం ఇసుక. రెండు దశాబ్దాలుగా ఇసుకే ఆహారం. మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు జిల్లాలోని మహానందికి వచ్చిన ఆయన ఇసుక తింటూ కనిపించడంతో భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు.
 
భక్తులు కొందరు చొరవ తీసుకుని ఇసుక ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ.. తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని 20 ఏళ్ల క్రితం విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానని, కోరిక తీరడంతో అప్పటి నుంచి ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చారు. భక్తులు ఎవరైనా దేవుడు ప్రసాదం ఇస్తే తింటానని, లేదంటే ఇసుకే తన ఆహారమని తెలిపారు.
 
కోటేశ్వరరావు ఇసుకను ఆహారంగా తీసుకుంటుండడంపై స్థానిక వైద్యుడు ఒకరు మాట్లాడుతూ, ఇసుకలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉంటాయని చెప్పారు. రోజూ ఇసుకను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా మారుతుందని వివరించారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు.