భార్యపై అనుమానంతో కన్నకుమార్తెను బండరాయితో మోది చంపేసిన తండ్రి..
కట్టుకున్న భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త కిరాతకుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపంతో కన్న కూతురిని బండ రాయితో మోది చంపేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలోని మార్కొండాపురంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన బూసిరాజు వెంకటేశ్వర్లు, పద్మాపురం గ్రామానికి వెంకటనరసమ్మలకు 16 సంవత్సరాల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలున్నారు. భర్త మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో కనిగిరి నుంచి పిల్లలతో కలిసి వెంకటనరసమ్మ పుట్టింటికి, వెంకటేశ్వర్లు తన సొంతూరు వెళ్లిపోయి రెండు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు.
బతుకుదెరువు నిమిత్తం వెంకటనరసమ్మ తన సోదరుడితో కలిసి రోజూ పద్మాపురం నుంచి కనిగిరి వచ్చి బేల్దారి పనులు చేసుకుని వెళ్లిపోతారు. పట్టణంలోనే చదువుతున్న చిన్నకుమార్తె మంజుల (13)ను తమ వెంట తీసుకొచ్చి పాఠశాలలో దిగబెడతారు. పని ముగిసిన తర్వాత సాయంత్రం తమ వెంట తీసుకుపోయేవారు.
సోమవారం సాయంత్రం యథావిధిగా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు పాఠశాలకు వెళ్లగా మంజుల ఆమె తండ్రితో కలిసి వెళ్లినట్లు సహ విద్యార్థులు చెప్పారు. తనతో ఇంటికి తీసుకెళ్లి ఉంటాడని భావించిన బాలిక తల్లి, మేనమామ పద్మాపురం వెళ్లిపోయారు.
అయితే, ఉపాధ్యాయుల అనుమతితో పాఠశాల నుంచి మంజులను తీసుకెళ్లిన వెంకటేశ్వర్లు.. కుమార్తెతో పాటు బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కి ఎన్.గొల్లపల్లి చెరువు సమీపంలో పద్మాపురానికి వెళ్లే రోడ్డు దగ్గర దిగాడు. అక్కడకి దగ్గర్లోనే ఉన్న రాళ్ల గుట్ట వరకు కుమార్తెను నడిపించి.. ఎవరూ లేని సమయం చూసి కింద పడేసి రాళ్లతో తల, ముఖంపై మోది అత్యంత కిరాతకంగా హతమార్చి అక్కడ నుంచి పారిపోయాడు.
మంగళవారం ఉదయం వెంకటనరసమ్మ యథావిధిగా తన సోదరుడితో కలిసి కనిగిరి బయలుదేరారు. వీరు గొల్లపల్లి గ్రామ శివారుకు రాగానే అక్కడ జనం గుమిగూడి ఉండటంతో వెళ్లి చూడగా.. తన కుమార్తె మృతదేహం పడి ఉండటంతో నరసమ్మ కుప్పకూలిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల నుంచి దర్యాప్తు ప్రారంభించి ఘాతుకానికి పాల్పడింది తండ్రే అని గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.