బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (09:18 IST)

ఏపీలో దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికలు - వైకాపాను వీడుతున్న కీలక నేతలు

ysrcp flag
లోక్‌‍సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగాల్సివుంది. ఇందుకోసం ఏపీలోని అధికార వైకాపా అధ్యక్షుడు పలు దఫాలుగా వడపోత పోసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అయితే, సర్వేలు పేరుతో అనేకమంది సిట్టింగ్ అభ్యర్థులకు మొండి చేయి చూపుతున్నారు. ఇలాంటి వారంతా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు వైకాపాకు టాటా చెప్పేశారు. నిజానికి వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులు. సన్నిహితులు కూడా. అయినప్పటికీ వీరికి టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. 
 
మరోవైపు, బీసీ వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ కుమార్ సైతం పార్టీని వీడారు. వారెవరినీ ఆపేందుకు, లేదా ఎందుకు వెళ్తున్నారో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి గానీ, వైకాపా ముఖ్యనేతలుగానీ ప్రయత్నించలేదు. కానీ.. పార్థసారథి వెళ్తున్నారన్న ఒక్క మాట వైకాపాను కుదిపేసింది. ఆ పార్టీ జిల్లా నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు ప్రాంతీయ సమన్వయకర్తలు వరుసబెట్టి ఆయనతో చర్చించారు. 
 
పార్టీలో కొనసాగేలా ఆయన్ను ఒప్పించేందుకు శతథా ప్రయత్నించారు. ఒక నేతను పక్కనపెడితే వాళ్ల మొహం చూసేందుకూ ఇష్టపడని సీఎం జగన్... పార్థసారథిని మాత్రం పిలిపించుకుని అరగంటకు పైగా మాట్లాడారు. పార్థసారథి విషయంలోనే ఎందుకిలా? పార్థసారథినే వైకాపా అధిష్ఠానం ఎందుకింత బుజ్జగించింది? ఇదంతా 'కుల'కలవరమేనా అంటే అవుననే చెబుతున్నాయి వైకాపా వర్గాలు. 
 
పార్థసారథి బీసీ.. అందులోనూ యాదవ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. ఆయన పార్టీని వీడితే.. ఆ ప్రభావం ఒక్క పెనమలూరులోనే కాక.. ఆయన సామాజికవర్గ ఓట్లు గణనీయంగా ఉన్న పామర్రు, మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు ప్రాంతాల్లోనూ పడేప్రమాదం ఉంది. అది వైకాపాకు చేటుచేస్తుందనే సారథిని బుజ్జగించారు. అయితే, తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయన సిటింగ్ స్థానమైన పెనమలూరును మాత్రం మంత్రి జోగి రమేష్‌కు ఇవ్వడం గమనార్హం.
 
మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన పార్థసారథి.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీనియర్ బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు. 2017లో వైకాపా కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు పార్థసారథిలో స్థలంలోనే ఏర్పాటుచేశారు. అప్పుడు ఆయనకు అద్దె కూడా ఇవ్వలేదని, కార్యాలయ నిర్వహణ ఖర్చులనూ సారథే భరించేవారని చెబుతుంటారు. 
 
ఆ దేశంలో నైట్రోజన్ గ్యాస్‌కు మరణశిక్ష అమలు.... ఎక్కడ?
 
అగ్రరాజ్యం అమెరికాలోని ఓ రాష్ట్రం వివిధ నేరాలకు పాల్పడిన ఉరిశిక్ష పడిన ఖైదీలకు శిక్షలు అమలు చేసే విషయంలో కొత్త పద్ధతులను అమలు చేస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో ఉరి వేయడం ద్వారా ఈ శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో మాత్రం ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ముద్దాయిలకు ఉరిశిక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని అలబామా రాష్ట్రం ఇంకో సరికొత్త పద్ధతిలో ఈ శిక్షను అమలు చేయనుంది. ప్రాణాంత ఇంజెక్షన్లు లభించకపోవడంతో నెట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఈ శిక్షను అమలు చేయనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నైట్రోజన్ గ్యాస్‌ను పీల్పించడం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. ఈ మేరకు అలబామా రాష్ట్ర అధికారులకు యూఎస్ ఫెడరల్ జడ్జి అనుమతి ఇచ్చారు. 1988లో కిరాయి హత్యకు పాల్పడిన కెన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి ఈ విధానంలో మరణదండన విధించనున్నారు. జనవరి 25న అలబామాలో శిక్షను అమలుచేయనున్నారు. అయితే నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దోషి కెన్నెత్ స్మిత్ కోర్టులో పిటిషన్ వేయగా దానిని ఫెడరల్ జడ్జి తోసిపుచ్చారు. 
 
ప్రతిపాదిత పద్ధతిలో మరణశిక్ష ప్రమాదకరమైనదని, ముఖానికి ధరించే మాస్క్ పగిలిపోయి ఆక్సిజన్ లోపలి వస్తే శరీర భాగాలు దెబ్బతిని దీర్ఘకాలంపాటు అచేతనంగా పడి ఉంటుందని అభ్యంతరం తెలిపాడు. మరణశిక్షను నిలిపివేయాలని కోరాడు. ఈ మేరకు అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్‌పై కెన్నెత్ దావా వేయగా జడ్జి కొట్టివేశారు. నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఉరిశిక్షను కొనసాగించవచ్చునని అలబామాలోని మోంట్ గోమెరీ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఆర్ ఆస్టిన్ బుధవారం ఈ తీర్పు ఇచ్చారు. ఈ పద్ధతి క్రూరమైనదని, అసాధారణమైన శిక్ష అని ఖైదీ చెప్పలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్మిత్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.
 
కాగా ఈ పద్ధతిలో ఖైదీ ముఖానికి మాస్క్‌ని కట్టి నైట్రోజన్ గ్యాస్‌ని వదులుతారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే.. అమెరికా రాష్ట్రాలు ఉరిశిక్షలో ఉపయోగించే ప్రాణాంతక లెథల్ ఇంజెక్షన్లను ప్రొటోకాల్ ప్రకారం పొందడం చాలా సంక్లిష్టంగా మారింది. మరణశిక్షల్లో వాడే ఔషధాలను విక్రయించొద్దని కంపెనీలపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించడం ఇందుకు కారణమైంది. దీంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్ వంటి పాత పద్ధతులను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఇక అలబామా, మిస్సిస్సిప్పి, ఓక్లహామా రాష్ట్రాలు కొత్త గ్యాస్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాయి. కాగా జడ వాయువు ద్వారా ఊపిరాడకుండా చేసి మరణశిక్ష విధించడం హింస అని, క్రూరమైన అమానవీయమైన శిక్ష అని ఐక్యరాజ్యసమితి నిపుణులు గత వారమే హెచ్చరించారు.