ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య
పెళ్లయిన 5 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కాకినాడ జిల్లా గోపాలపట్నంలో చోటుచేసుకున్నది. ఇన్ స్టాగ్రాంలో తన భార్య ఎవరితోనో సన్నిహితంగా వున్నట్లు అనుమానపడ్డ భర్త ఆమెను వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కాకినాడ జిల్లా పాతపట్నం మండలం తడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ తో ఐదు నెలల క్రితం వివాహం జరిపించారు.
వీరి పెళ్లయిన తర్వాత తమ నివాసాన్ని గోపాలపట్నంకు మార్చారు. భర్త సమీపంలో ఓ కంపెనీలో పనిచేస్తుండగా శిరీష తన అత్తతో కలిసి ఇంటిలోనే కలిసి వుంటుంది. ఐతే శిరీష తనకు తెలియకుండా వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తున్నదని ప్రదీప్ అనుమానం పెంచుకున్నాడు. సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తుండటంతో బుధవారం నాడు తండ్రికి ఫోన్ చేసి తన భర్త, అత్తయ్య ఇద్దరూ తనను వేధిస్తున్నారనీ, తనకు చనిపోవాలని వుందని చెబుతూ కన్నీటిపర్యంతమైంది. దీనితో శిరీష తండ్రి హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. ఐతే అప్పటికే ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానకికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.