చేయూతతో మహిళలు ... అమ్మ ఒడితో స్కూళ్ళు కళ కళ
వైయస్‌ఆర్ చేయూత పథకంతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమయిందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తానేటి వనిత వివరించారు. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 78.76 లక్షల మంది సభ్యులకు రూ.25516.56 కోట్లు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 78.78 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగిందన్నారు.
చంద్రబాబు హయాంలో రుణ మాఫీ చేయకపోవడం వల్ల స్వయం సహాయక సంఘాల పరిస్థితి దారుణంగా ఉండేదని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రుణాలు విడతల వారిగా మాఫీ చేయడంతో సంఘాలు కోలుకోగలుగుతున్నాయన్నారు మంత్రి వనిత. గతంలో సీ,డీ గ్రేడింగ్ గ్రూపులు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు రూ.75 వేలు అందజేస్తున్నామని, ఈ పథకాన్ని ఆగస్టు 12, 2020న ప్రారంభించారన్నారు. ఇప్పటి వరకు 24.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.8953.53 కోట్లు విడుదల చేశామని, ఈ పథకం కింద మొదటి ఏడాది అమూల్, హిందుస్థాన్, ఐటీసీ, పీఆర్ అండ్ ఆర్ సంస్థలతో ఒప్పందం చేసుకొని మహిళలను తమ కంపెనీల్లో భాగస్వాములనుగా చేసుకుందన్నారు.
వైయస్‌ఆర్ కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు చొప్పున కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉప కులాల మహిళలకు రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మహిళల జీవన ప్రమాణాలు పెంపొందించామని మంత్రి చెప్పారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని, దీని కోసం 3,27,867 మందికి రూ.981.88 కోట్లు వెచ్చించామన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా దేశంలోనే మొదటి సారిగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నామని, ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుపై బాధ్యత, పాఠశాల నిర్వాహణపై బాధ్యత పెరుగుతోందన్నారు. వైయస్‌ఆర్ పెన్షన్ కానుక ద్వారా 61.73 లక్షల మందిలో 36.7 లక్షల మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్యాప్య పింఛన్ కింద 21899 మంది ఉన్నారని, చేనేత కార్మికులు, వికలాంగులు, వితంతువులు, డప్పు కళాకారులు, సైనిక సంక్షేమ పింఛన్లు, రోగులకు ఆరోగ్య పింఛన్లు చెల్లిస్తున్నామని చెప్పారు.