ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతి...నిన్న అసెంబ్లీకి వచ్చి...
ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా అకస్మాత్తుగా మృతి చెందారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి ఆమె గుండె పోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ కరీమున్నీసా చికిత్స పొందుతూ మృతి చెందారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు.
గతంలో విజయవాడలోని 54వ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేసిన ఆమెకు ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం తనను కలచివేసిందని ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.