శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 6 జనవరి 2020 (14:43 IST)

వైసీపీకి మోహన్‌బాబు రూపంలో షాక్ తగలబోతోందా?

సినీ నటుడు మోహన్‌బాబు త్వరలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌బాబు సోమవారం భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నట్లు తెలిసింది. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. 
 
ఈ సందర్భంగా.. బీజేపీలో చేరాలని మోహన్‌బాబును మోదీ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీలో నెంబర్ 2 నేతగా కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా మోహన్‌బాబు కలవనున్నట్లు తెలిసింది.
 
ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన ‘ఫ్యాన్’ పార్టీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి ఖాయమని ఆయన భావించారు. జగన్ సీఎం అయ్యారు గానీ మోహన్ బాబు ఆశించింది జరగలేదని, అందుకే ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బంధుప్రీతితో వైసీపీలో ఉంటే ఒరిగేదేమీ లేదన్న ఆలోచనలో ఉన్న మోహన్‌బాబు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 
 
అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపోమాపో ఆయన కమలం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేగానీ జరిగితే.. వైసీపీకి మోహన్‌బాబు రూపంలో షాక్ తగలడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.