శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (17:30 IST)

ఏలూరులో వింత వ్యాధి.. పిట్టల్లా పడిపోతున్న జనం.. సీఎం సమీక్ష.. గవర్నర్ ఆరా!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నారే తప్ప ఆ వ్యాధి ఏంటన్నది వైద్యులకు కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. మూర్ఛ, వాంతులు, స్పృహకోల్పోతుండడం వంటి లక్షణాలతో పెద్దలు, పిల్లలు ఆసుపత్రులకు తరలివస్తున్నారు. ఇప్పటికే 200 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. 
 
ఈ వింత వ్యాధి ఏపీ సర్కారును ఆందోళనకు గురిచేసింది. వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఈ వింత వ్యాధి 200 మందికిపైగా సోకింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా, ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. 
 
ఏలూరులో వింత రోగానికి గురైన బాధితుల ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య బృందం పని తీరు, జిల్లా యంత్రాంగం, అధికారులు పని తీరు అభినందనీయమన్నారు. రాత్రంతా మేల్కొని బాధితులకు అవసరమైన వైద్య సహాయక చర్యలు చేపట్టిన మంత్రి ఆళ్ల నాని తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, తీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ అన్నారు. వ్యాధి లక్షణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను ఏలూరుకు పంపిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నానికి చెప్పారు. 
 
ఎలాంటి భయందోళన చెందవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులు అయినా వైద్య బృందాలతో పరీక్షలు చేయిద్దామని సీఎం జగన్ చెప్పారు.
 
గవర్నర్ ఆరా.. 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు. ఒకేసారి వందల మంది అస్వస్థతకు గురికావడం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యచికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.
 
ప్రభుత్వ తీరుపై బాబు విస్మయం  
ప్రజల పట్ల ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న తీరు పట్ల విస్మయానికి గురయ్యానంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. 'ఏలూరులో కలుషిత నీరు తాగి 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. 
 
స్థానిక తాగునీటి వ్యవస్థల గురించి 18 నెలలుగా ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. పాలించే సమర్థత లేని, బాధ్యతారహిత వైసీపీ ప్రభుత్వం చర్యలను ఏలూరు ఘటన మరోసారి స్పష్టం చేసింది' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
 
కలుషిత నీరే కారణం? 
శ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు.
 
‘ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు, 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
 
‘ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది. వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని లోకేశ్ చెప్పారు.
 
ఇదిలావుంటే, ఏలూరులో వింతవ్యాధి బారినపడిన ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది వాటిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ నివేదికలు వస్తే వ్యాధి గురించి ఏమైనా తెలిసే అవకాశముందని భావిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ స్పందిస్తూ సమస్యకు కారణంపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. 
 
అటు ఈ వింత వ్యాధిని కొందరు మానసిక వైద్య నిపుణులు మాస్ హిస్టీరియాగా అభివర్ణిస్తున్నారు. అధికారులు వివిధ ప్రాంతాల నుంచి తాగునీటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి బాధితులు ఆసుపత్రులకు క్యూలు కట్టారు. 
 
దాంతో బాధితులకు ముందు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏలూరు పట్టణంలోని పడమర వీధి, దక్షిణ వీధి, గొల్లాయగూడెం, కొత్తపేట, శనివారపు పేట ప్రాంతాల నుంచి అత్యధిక కేసులు వచ్చినట్టు గుర్తించారు. దాంతో కాలనీల్లోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
 
కాగా,  ఏలూరు ఘటనతో ప్రత్యేక వైద్య బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టాయి. ప్రజలు వారు తిన్న ఆహారం, తాగిన నీటితో పాటు పరిసరాలను పరిశీలించాయి. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నాయి.