శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 జులై 2014 (14:44 IST)

ఆ ఎంపీల జంప్... మిగిలేది జగన్ చుట్టాలైన ఎంపీలేనా...?

వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు లోక్ సభ సభ్యులు పార్టీ నుంచి జంప్ చేసేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. కాగా ఈ నలుగురు ఎంపీల్లో ఇప్పటికే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ బంధువులైన నలుగురు ఎంపీలు మాత్రమే మిగులుతారంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
 
అసలు 2014 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎగబడ్డ లీడర్స్, పార్టీ పవర్ లోకి రాకపోయేసరికి మెల్లమెల్లగా జారుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జగన్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా తెలుగుదేశం అధినేతతో మాట్లాడి తంటాలు తెచ్చుకున్నారు. 
 
ఆమె కూడా జెండా పీకేస్తున్నట్లు ప్రకటించలేదు కానీ దాదాపు పార్టీకి దూరమైపోయారంటున్నారు. కేవలం అనర్హత వేటు భయంతోనే ఆమె నోరు మెదపడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా అరకు పార్లమెంటరీ నాయకురాలు, ఎంపీ కొత్తపల్లి గీత కూడా కొత్త పల్లవి అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని బహిరంగంగా చెప్పేశారు. దీన్నిబట్టి ఆమె ఇక ఎంతో కాలం పార్టీలో ఉండరనీ, త్వరలో తెదేపా తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఐతే ఆమె వ్యాఖ్యలు పార్టీని ఆశ్చర్యానికేమీ గురిచేయలేదు. దీనికి కారణం... పార్టీని వదిలిపెట్టి వెళ్లేవారంతా ఇలాంటి కామెంట్లు కొట్టడం సహజమేనన్న అభిప్రాయంలో వైసీపీ ఉన్నదని చెపుతున్నారు. మరోవైపు తిరుపతి ఎంపీ వరప్రసాదరావు కూడా పార్టీకి విశ్వాసపాత్రుడుగా లేరనే ప్రచారం జరుగుతోంది. అలా చూసినప్పుడు వైసీపీ గెలుచుకున్న మొత్తం 8 ఎంపీల్లో నలుగురు గోడ దూకేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
మిగిలినవాళ్లెవరయ్యా అంటే, జగన్ బంధువులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి మాత్రమే ఉంటారనే ప్రచారమూ నడుస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆకర్ష దెబ్బకు జగన్ పార్టీ కుదేలవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.