తిరుపతి పర్యటనకు వస్తున్న నారా భువనేశ్వరి...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. ఇటీవల సంభవించిన తిరుపతి వరదల్లో నిరాశ్రయులుగా మారిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం చేయనున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అధికార వైకాపా మంత్రులతో పాటు టీడీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కలిసి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో వల్లభనేని వంశీ మీడియా ముఖ్యంగా నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి తిరుపతి పర్యటనకు వస్తున్నారు.
ఈ పర్యటనలో తిరుపతి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 48 మందికి నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి.