ఏపీ మంత్రి కన్నబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వైకాపాకు చెందిన ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసు విచారణకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు.
ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది.
ఈ కేసు విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. అయితే, విచారణకు వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది.
అటు, హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు మూసివేస్తామని గత విచారణలో స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో కన్నబాబు, అంబటి రాంబాబులకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది.