సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (09:21 IST)

నెల్లూరులో కుమార్తెపై ఆర్నెల్లుగా తండ్రి అత్యాచారం

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డ శీలాన్ని చిదిమేశాడు. 14 యేళ్ల బాలికపై ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. తర్వాత వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం కలిగిన మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. 
 
అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ మహిళ, తన ఇద్దరు బిడ్డలు, అంజయ్యతో కలిసి ఉంటోంది. ఆమె కుమార్తెపై కన్నేసిన ఈ కామాంధుడు గత 6 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. 
 
దీంతో బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికపై మరోమారు అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు.
 
దీన్ని గమనించిన పదేళ్ల కుమారుడు కేకలు వేయగా స్థానికులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది. అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు... కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.