పెళ్లయిన మూడో రోజు ప్రియుడితో లేచిపోయిన నవ వధువు
తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు వివాహమైన మూడో రోజే తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది. దీన్నీ జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతికి పొరుగూరుకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే యువకుడితో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఆమె బలవంతంగా అంగీకరించింది. అదేసమయంలో తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది.
ఈ క్రమంలో పెళ్లి అయిన మూడో రోజే వధువు ప్రియుడు శివాజీతో కలిసి ఊరువదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వధువు బంధువులు ఆదివారం రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే, శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.