మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:13 IST)

క‌ల్యాణ‌మండ‌పాల లీజు ఈనాటిది కాదు... భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌ద్దు!

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌క్తులు అతి చేరువ‌లో స్వామివారి సేవ చేసుకునే భాగ్యం క‌ల్పించ‌డం కోసం, వినియోగంలో లేని టిటిడి  క‌ల్యాణ‌మండ‌పాలు లీజుకు ఇవ్వాల‌ని తీసుకున్న‌ నిర్ణ‌యంపై కొంద‌రు అవాస్త‌వ ఆరోప‌ణ‌లు చేసి భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకునే పద్ధ‌తి మానుకోవాల‌ని టిటిడి హిత‌వు చెబుతోంది. వినియోగంలో లేని టిటిడి  క‌ల్యాణ‌మండ‌పాలు, భ‌వ‌నాలు, భూముల‌ను లీజుకు ఇచ్చే ప్రక్రియ ఈనాటిది కాదు. వీటిని వినియోగంలోకి తేవ‌డంతోపాటు సంర‌క్షించుకోవ‌డం కోసం  GO MS NO :  311 తేదీ 9 -4-1990 రూల్ నంబర్ 138 ప్రకారం కొన్నేళ్లుగా టిటిడి లీజు విధానాన్ని అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా టిటిడికి చెందిన 29 క‌ల్యాణ మండ‌పాలు హిందూ ధార్మిక సంస్థ‌లు, ఆల‌యాలు, ట్ర‌స్టులు, హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తుల‌కు ఇదివ‌ర‌కే లీజుకు ఇచ్చారు. వీటి నిర్వ‌హ‌ణ‌, నిబంధ‌న‌ల అమ‌లుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
 
దేశ‌వ్యాప్తంగా టిటిడి ఆస్తుల వినియోగం మెరుగుప‌ర‌చ‌డం, భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందుబాటులో ఉంచ‌డానికి ఈ లీజు ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఇందులో ముఖ్యంగా 365 రోజులు క‌ల్యాణ‌మండ‌పాల వినియోగం ఉండేలా, హిందూధ‌ర్మ‌ప్ర‌చారానికి వేదిక‌లుగా క‌ల్యాణ‌మండ‌పాల‌ను భ‌క్తుల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డానికి ఈ ప్ర‌క్రియ దోహ‌ద‌ప‌డుతుంది. టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఏ విధంగా ఉప‌యోగంలోకి తేవాల‌నే అంశంపై ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సుదీర్ఘంగా చ‌ర్చించి మేధావుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. 
 
ఇందులో గౌహ‌తి హైకోర్టు మాజీ యాక్టింగ్‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ కెఎస్‌.శ్రీ‌ధ‌ర్‌రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మంధాట సీతారామ‌మూర్తి, శృంగేరి శార‌దాపీఠం ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డా. విఆర్‌.గౌరీశంక‌ర్‌, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద‌హ‌రి, సోష‌ల్ రీఫార్మ‌ర్ మెంబ‌ర్ శ్రీ బ‌య్యా శ్రీ‌నివాసులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు డాక్ట‌ర్ కొండుభ‌ట్ల రామ‌చంద్ర‌మూర్తి స‌భ్యులుగా ఉన్నారు.  ఈ క‌మిటీ టిటిడి ఆస్తుల జాబితాను ప‌రిశీలించి వినియోగంలో లేని ఇలాంటి అనేక క‌ల్యాణ‌మండ‌పాలతోపాటు, భ‌వ‌నాలు, భూములను కూడా వినియోగంలోకి తేవాల‌ని సిఫార‌సు చేసింది.
 
ఈ సిఫార‌సుల‌పై ధ‌ర్మక‌ర్త‌ల మండ‌లి విస్తృతంగా చ‌ర్చించి వినియోగంలో లేని టిటిడి ఆస్తులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు, అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు నిల‌యాలుగా మార‌కూడ‌ద‌నే ఉద్దేశంతో క‌ఠిన నిబంధ‌న‌లు రూపొందించి లీజుకు ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు నిబంధ‌న‌లు త‌యారుచేసి క‌ల్యాణ‌మండ‌పాల లీజుకు సంబంధించి నోటిఫికేష‌న్ ఇచ్చారు. హిందూ ధార్మిక సంస్థ‌లు, ఆల‌యాలు, ట్ర‌స్టులు, హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే వీటిని లీజుకు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. వీటిలో హిందూ మ‌తానికి చెందిన వివాహాలు, అన్న‌ప్రాస‌న, ఉప‌న‌య‌నం, బార‌సాల‌, ష‌ష్టిపూర్తి, స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం వంటి హిందూ మ‌తానికి చెందిన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డానికి మాత్ర‌మే అనుమ‌తించ‌డం జ‌రిగింది. నిబంధ‌న‌ల అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం టిటిడిలోని అధికారుల‌తో నాలుగు టాస్క్‌ఫోర్స్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ఈ క‌ల్యాణ‌మండ‌పాలు వినియోగంలోకి తెస్తే, త‌మ‌కు అందుబాటులో ఉండి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డం కోసం ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఎంతోమంది భ‌క్తులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
 
క‌ల్యాణ‌మండ‌పాలు లీజుకు ఇచ్చి వాటి ద్వారా ఆదాయం పొందాల‌నే ఉద్దేశం టిటిడికి లేదు. టిటిడికి సంబంధించి వినియోగంలో లేని ఆస్తులు వినియోగంలోకి తేవ‌డం, వాటిని ప‌రిర‌క్షించ‌డంతోపాటు సంస్థ‌కు మేలు జ‌రిగే, భ‌క్తుల మ‌నోభావాలు సంర‌క్షించ‌డం కోసం ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకునే అధికారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి ఉంది. ఇటువంటి నిర్ణ‌యం తీసుకున్న త‌రుణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న టిటిడి యాజ‌మాన్యం కేవ‌లం భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండ‌డం కోస‌మే ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నామ‌ని టిటిడి పేర్కొంది.