ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభించదలచిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గాక విచక్షణ కోటా, ఆన్‌లైన్ లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లు మంజూరు చేస్తామన్నారు.
ఇక మీదట ఏ ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకోకూడదని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. కల్యాణమండపాల నిర్మాణానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.
టిటిడి ఆలయాల వద్ద పంచగవ్య ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణ కోసం వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో ఈవో మాట్లాడారు.
- పంచగవ్య ద్వారా అగరబత్తీలు, సబ్బులు లాంటి 15 ఉత్పత్తులు, ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే 15 ఉత్పత్తులను త్వరలో తయారు చేస్తాం. ఇందుకోసం ఆయుర్వేద ఫార్మసీలో యంత్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నాం.
- ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకువస్తేనే అనుమతిస్తాం.
- భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అలిపిరిలో రెండు చోట్ల 2 వేల వాహనాలు, తిరుమలలో రెండు చోట్ల 1500 వాహనాలు పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
- టిటిడి కల్యాణ మండపాల లీజు కాలాన్ని 3 నుండి 5 ఏళ్లకు, ఆ తరువాత మరో రెండేళ్లు పొడిగించేలా విధి విధానాలు తయారు చేస్తున్నాం.
- తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో విద్యుత్‌తో నడిచే వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించే ఆలోచన చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆర్‌టిసి 150 విద్యుత్ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టిటిడి అధికారులకు కూడా విద్యుత్‌తో నడిచే వాహనాలను కేటాయిస్తాం.
- ఎన్‌టిపిసి ద్వారా ధర్మగిరిలో 25 ఎకరాల్లో 5 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 14.41 లక్షలు
- హుండీ కానుకలు - రూ.90.45 కోట్లు
- తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు - రూ.3.51 కోట్లు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ కానుకలు - రూ.12 లక్షలు
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 76.61 లక్షలు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 21.07 లక్షలు
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 6.72 లక్షలు