ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 26 ఏప్రియల్ 2018 (19:54 IST)

అమరావతిలో 1000 అపార్టుమెంట్లు... ప్రజలకు వేలం... చ.అడుగు ఎంతో తెలుసా?

అమరావతి : అమరావతిలో వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ఇతరుల కోసం రూ.494 కోట్ల వ్యయంతో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా వారికి విక్రయించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఈ అపార్టుమెంట్

అమరావతి : అమరావతిలో వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ఇతరుల కోసం రూ.494 కోట్ల వ్యయంతో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా వారికి విక్రయించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఈ అపార్టుమెంట్లను మూడు కేటగిరిలో నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబునాయు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో బుధవారం జరిగిందన్నారు. 
 
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న అపార్టుమెంట్ల నిర్మాణాల ప్రగతిపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారన్నారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాజధాని భూ సేకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ కింద మిగిలిన 1500 ఎకరాలపై చర్చజరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిటీ కోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. కోర్టులు అమరావతికి వచ్చిన తరవాత దాంట్లో ఎందరో ఉద్యోగులు ఉంటారన్నారు. వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉంటారన్నారు. వారందరికీ కోసం రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు అనుమతులిచ్చారన్నారు. 
 
ఏడాదిలోగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో త్వరలో టెండర్లు పిలవడానికి సీఆర్డీయే చర్యలు చేపట్టిందన్నారు. జి+11 పద్ధతిలో చేపట్టే ఈ అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందన్నారు. వేలం పద్ధతిలో అపార్టుమెంట్లు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఈ నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి మరిన్ని అపార్టుమెంట్ల నిర్మాణం చేపడతామన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500ల అపార్టుమెంట్లు, 1500 చదరపు అడుగుల్లో 300లు, 1800 చదరపు అడుగుల్లో 200లు.. ఇలా మూడు కేటగిరీల్లో రాజధాని పక్కన నిర్మించనున్నామన్నారు. నో లాస్... నో ప్రాఫిట్ విధానంలో ఈ అపార్టుమెంట్లను చదరపు అడుగు రూ.3,500లకు విక్రయించనున్నామని మంత్రి తెలిపారు. కోర్టుల్లో పనిచేసే లాయర్లకు ఈ అపార్టుమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
 
71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు...
రాష్ట్రంలో మొదటి విడతగా 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఉంటుందన్నారు. లంచ్, డిన్నర్ ఖరీదు రూ.5 అని మంత్రి తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పొంగల్, ఉప్మా ఉంటాయన్నారు. ఇడ్లీ రేటు రూపాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలు గుర్తించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర శాఖలకు చెందిన భూములు కూడా ఉన్నాయన్నారు. వాటిని అన్న క్యాంటీన్లు నిర్మాణానికి కేటాయిస్తూ బుధవారమే జీవో జారీచేయనున్నట్లు తెలిపారు.
 
ఆనం వివేకానందరెడ్డి ప్రజల మనిషి...
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి ఎంతో బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా పనిచేశారన్నారు. పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ప్రజల మనిషి అని కొనియాడారు. ఆనం వివేకానందరెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తునున్నాని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.