గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (12:14 IST)

ప్రకాశం జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ శ్రీకారం

ప్రకాశం జిల్లా జిల్లా రెవెన్యూ శాఖలో అవనీతి అక్రమార్కులను ఏరివేసేందుకు జిల్లా కలెక్టర్ నడుం బిగించారు. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్‌ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుడుతోంది. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది.  
 
సరిగ్గా రెండు నెలల క్రితం జూన్‌ 2వ తేదీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌ కుమార్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్‌ను కూడా సస్పెండ్‌ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు.
 
ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడంలాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. వారికి సహకరించిన ఆర్‌ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. 
 
పొదిలి తహసీల్దార్‌ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్‌ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్‌ భూముల లీజ్‌ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్‌ కె.విజయకుమారిని కూడా సస్పెండ్‌ చేశారు. 
 
తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్‌ ఎన్‌.సుధాకరరావు, ఆర్‌ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్‌ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్‌లైన్‌ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్‌ కఠినంగా స్పందించారు.