బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (21:38 IST)

రాత్రికి రాత్రి దిద్దుబాటు చ‌ర్య‌... సుబ్బారావు గుప్తాకు బుజ్జ‌గింపులు!

వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఆందోళనకు సిద్దం అవుతున్న తరుణంలో వైసీపీ నేత‌ల‌ దిద్దుబాటు చర్యలు, బుజ్జగింపుతో వివాదం సమసింది. వైసీపీ నేతల దౌర్జన్య అరాచకలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ దాడులు నిలుస్తున్నాయ‌ని నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. 
 
 
మంత్రి బాలినేని శ్రీనివాస్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆయన అనుచరుల చేతిలో దెబ్బలు తిన్న ఒంగోలు వైసిపి నేత సుబ్బారావు గుప్తా మంగళవారం ఉదయం బాలినేని పక్కన ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలిసి ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై జగన్, జై బాలినేని అంటూ నినాదాలు కూడా చేశారు. దీని వెనుక చాలా వ‌ర్క‌వుట్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.
 
 
గుప్తాపై మంత్రి వాసు అనుచరుడు సుభానీ దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో, రాత్రికి రాత్రే బాలినేని అతడ్ని పిలిపించుకొని బుజ్జగించి తనవెంట తిప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిజానికి గుప్తాపై దాడి వ్యవహారంలో ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిధ్ధమయ్యాయి. పరిస్థితి చేయి జారిపోయే సూచనలు కనిపించడంతో, మంత్రి వాసు అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రే సుబ్బారావుతో రాజీ చేసుకున్నారు. లేకుంటే, మ‌ర్నాడే ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ పుట్టిరోజు ప‌రిస్థితి కరాబు అయిపోతుంద‌ని నేత‌లు ఈ జాగ్ర‌త్త ప‌డ్డారు. చివరికి సుబ్బారావు ఉదంతం చ‌ల్ల‌బ‌డింది.