సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (06:56 IST)

జనవరి 2వ వారానికి ఉల్లి ధరలు తగ్గుముఖం: మంత్రి మోపిదేవి

ధరల స్థిరీకరణ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉల్లి సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చేసిన హడివిడి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఉల్లి సమస్య దేశంలోని అన్ని రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడైనా రైతులు, వినియోగదారులకు అనుకూలంగా నిధులు కేటాయించారా అన్ని మంత్రి ప్రశ్నించారు.

కేవలం మన రాష్ట్రంలోనే ఉల్లి సమస్య ఉందని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఈ ఏడాది అకాల వర్షాలు పడటం వలన మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉల్లి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీని వల్ల ఉల్లి సమస్య ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు రెండు నెలల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారన్నారు.

పెరిగిన  ఉల్లి ధరలకు అనుగుణంగా ప్రజల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరకే అంటే రూ.25కే అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తొలిసారి ఆగస్టు 27న ఉల్లి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించినట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తరచూ రైతు బజార్ల ద్వారా ఉల్లిని ప్రజలకు సరఫరా చేస్తూ  వస్తున్నామన్నారు.

అయినప్పటికీ ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బందులు కొనసాగుతూ వచ్చాయన్నారు. గత నెల 14వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం 36,536 మెట్రిక్ టన్నుల ఉల్లిని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు  మంత్రి ప్రకటించారు. మన రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం, ముంబయిలోని నాసిక్, సోలాపూర్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని రైతుబజార్ల ద్వారా అందిస్తున్నామన్నారు.

అప్పుడు బహిరంగ మార్కెట్లో ఉల్లిధర రూ.70గా ఉందన్నారు. నేడు ఆ ధర రూ.130కి చేరిందన్నారు. ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఉల్లిధరలను మంత్రి వెల్లడించారు.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమ ప్రభుత్వం తక్కువ ధరకే ఉల్లిని ప్రజలకు అందిస్తుందని గుర్తుచేశారు. ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న  ప్రభుత్వం తమదే అన్నారు.

ప్రస్తుత ఉల్లి సమస్యను గుర్తించిన భారత ప్రభుత్వం 2500 మెట్రిక్ టన్నులను టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మరో రెండు రోజుల్లో ఇతర దేశాలకు చెందిన ఉల్లి ముంబయికి రానుందన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఉల్లి సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. వచ్చే జనవరి 2వ వారానికి కొత్త ఉల్లిపంట రైతుల చేతికి రానుందన్నారు.

దీనిపై ప్రతిపక్ష నాయకులు మెడలో ఉల్లిదండలు ధరించి శాసనసభలోకి రావాలనే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పొరుగురాష్ట్రమైన తెలంగాణలో గత వారం ఉల్లి సమస్య ఉత్పన్నమైతే 40 రూపాయలకు అమ్ముతున్న విషయాన్ని గుర్తుచేశారు. మార్కెట్లలో హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ విధానాన్ని అమలు చేస్తున్న తరుణంలో ప్రతిపక్షం రాద్దాంతం చేయడం సిగ్గుచేటన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నప్పటికీ ఎక్కడా లేని సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొనడం దారుణమన్నారు. బయటి పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులు కొంతమంది ఉల్లి సమస్యపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. పంటలు అధిక సంఖ్యలో దిగుమతి కావడం వల్ల కొన్ని చోట్ల గిట్టుబాటు ధరల్లో హెచ్చుతగ్గులు కలుగుతాయన్నారు.

ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు  ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా శీతల గిడ్డంగులను(కోల్డ్ స్టోరేజ్) నిర్మించి రైతుల పంటలను అందులో ఉంది వినియోగదారులకు మేలు చేస్తామన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సహకారంతో ఉల్లిని సరఫరా చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం లేదన్నారు. ఎక్కడో ఒక చోట కొద్ది మందికే ఉల్లి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.

వారి కోసమే రైతు బజార్లద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక చోట్ల అక్రమ ఉల్లి నిల్వలపై తమ అధికారులు దాడులు చేసి పట్టుకోవడం వాటిని ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. దాడులు ఇంకా కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటం వల్ల ఈ-క్రాఫ్ విధానం ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిందన్నారు.వాటిలో మార్పులు చేసి సమర్థవంతమైన ఈ –క్రాఫ్ విధానాన్ని రైతుల ఉత్పత్తులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామన్నారు. వాటికనుగుణంగా ధరల స్థిరీకరణ విధానాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని మంత్రి వెల్లడించారు.