గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:36 IST)

ఆస్ట్రేలియాలో వధూవరులు.. కర్నూలులో అంగరంగ వైభవంగా పెళ్లి...

సాధారణంగా పెళ్లంటే... ఆకాశమంత పందిరి. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కొందరు తమ ఇంటిపట్టునే చేసుకుంటే మరికొందరు లక్షలాది రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. 
 
కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. పెళ్లిళ్లే కాదు.. పండుగలు పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. చివరికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ మండపంలో లేకున్నా.. పెళ్లి తంతు జరుగుతోంది. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకొని డిజిటల్లో అందరికీ చూపిస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
 
కర్నూలు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి, శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజితకు.. నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు దినేష్ రెడ్డితో వివాహం జరిపించాలని రెండేళ్ల క్రితం పెద్దలు నిర్ణయించారు. కానీ రజిత, దినేష్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
కరోనా కారణంగా వారు ఆస్ట్రేలియా నుండి భారత్‌కి వచ్చే అవకాశం లేదు. అలాగే రజిత తల్లిదండ్రులు సైతం ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా వివాహం ఆలస్యం కావడంతో ఇక చేసేదేం లేక ఆన్‌లైన్లో తంతు జరిపించారు. 
 
వధూవరులిద్దరూ ఆస్ట్రేలియా నుంచి పెళ్లి చేసుకోగా.. వారి ఆత్మీయులు, బంధుమిత్రులు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆన్‌లైన్లో వారి పెళ్లిని తిలకించారు. ఈ ఫంక్షన్‌కు వచ్చిన వారికి పసైందన వంటకాలతో విందు భోజనాలు వడ్డించారు.