శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 18 మే 2017 (17:57 IST)

అసభ్యకరమైన వ్యాఖ్యలు, అర్ధనగ్న చిత్రాలు దానికి నిదర్శనమా? పరకాల ప్రభాకర్ ఫైర్

అమరావతి : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే అర్ధనగ్న చిత్రాల పోస్టింగ్స్, వాటిని సమర్థిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ నేతల వ్యవహార శైలిపట్ల ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక

అమరావతి : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే అర్ధనగ్న చిత్రాల పోస్టింగ్స్, వాటిని సమర్థిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ నేతల వ్యవహార శైలిపట్ల ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన  మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు. సోషల్ మీడియా అరెస్టులపై జస్టిస్ కట్జూ మాట్లాడిన మాటలకు ఆయన అభ్యంతరం తెలిపారు. ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా అని ఆయన పేర్కొన్నారు. వారు చేసిన పని రాజ్యాంగ విరుద్ధమైనదని, వారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అవుతుందన్నారు.
 
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటన్నారు. సుప్రీకోర్టు పైన, సుప్రీం కోర్టు జడ్జిలపైన, జర్నలిస్టులపై ఆయన గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. వాస్తవాలు తెలిసిన తరువాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామన్నారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఈ ప్రభుత్వానికి నమ్మకంలేనట్లు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేక వేదికలపై చెప్పినట్లు పేర్కొన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.
 
వ్యక్తిత్వ హననం, సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషను సోషల్ మీడియా పేరుతో వాడటం సబబేనా అని ఆయన ప్రధాన ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. మనం పలకలేని, ఏ పత్రికలో ప్రచురించడానికి, టీవీలో ప్రసారం చేయడానికి అర్హతలేని భాషను, మార్ఫింగ్ చిత్రాలను, అర్థనగ్న చిత్రాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వారి పత్రికల్లో ఎందుకు ప్రచురించడంలేదని, టీవీలో ఎందుకు ప్రసారం చేయడంలేదని ఆయన అడిగారు. కట్జూ ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ అని ఊరుకుంటారా? అని డాక్టర్ పరకాల ప్రశ్నించారు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యలు, చిత్రాలు పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిన ఇదే ఇంటూరి రవికిరణ్ మీద 31 జులై 2014లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలే విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపారు. కొత్తపల్లి గీత మీద రవికిరణ్ అసభ్య రాతలు, చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పార్టీ కార్యకర్తల ఫిర్యాదుపై ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే ఇద్దరిని  పోలీసులు అరెస్టులు చేశారని, ఆ తరువాత వారు కొన్ని నిబంధనలకు లోబడి బెయిల్ పైన విడుదలైనట్లు చెప్పారు. 
 
ఆనాడు రవికిరణ్ మీద పెట్టిన కేసు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనా? అప్పుడు ఆ పార్టీ వారు ఒక్కరు కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పారు. ఏడాది కాలంగా పెడుతున్న ఈ పోస్టింగులను ఇప్పుడు తొలగించారు. అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమని నమ్ముతూ వుంటే ఎందుకు పోస్టింగులు తీసేశారని ఆయన ప్రశ్నించారు. మహిళలను బికినీల్లో చూపించడం, పలకలేని భాషతో వ్యాఖ్యానాలు చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం.. తగునా అని ప్రశ్నించారు. డ్రయివర్లతో అక్కచెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఏవిధమైన భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నారని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. 
 
ఇటువంటి పోస్టింగులను తీవ్రంగా పరిగణించి  పౌర సమాజం చర్చించవలసిన అవసరం ఉందన్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు ఆమోదించాలనే అంశంపై పెద్దఎత్తున చర్చ జరగాలన్నారు. ఇందులో వున్న అనౌచిత్యాన్ని పౌరులు ప్రశ్నించిననాడే మళ్లీ ఇలాంటి వారు అసభ్యమైన కార్టూన్లు పెట్టడానికి సాహసించరని చెప్పారు. కార్టూన్ అంటే కొంత వ్యంగ్యంగా, వెటకారంగా ఉంటుందని, అది అసభ్యంగా చిత్రీకరించడం కాదన్నారు. తమపై వేసిన కార్టూన్లను చూసిన ప్రముఖులు కూడా నవ్వుకుంటారని,  జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా  కార్టూన్లు వేస్తే వాటిని చూసి ఆయన నవ్వుకునేవారని చెప్పారు. 
 
సచివాలయంలో వైరస్ ప్రభావంలేదు
రాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లపై రాన్సమ్ వేర్ వన్నా క్రై వైరస్ ప్రభావం చూపిందని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో ఎటువంటి అయోమయం, అనుమానం లేకుండా ఉండేందుకు వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో వున్న  సిస్టమ్స్‌ అన్నీ పటిష్టమైన యాంటీ వైరస్‌తో సురక్షితంగా వున్నాయన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. సచివాలయంలో మొత్తం 1350 సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని అన్నిటినీ పరీక్షించారని, ఎటువంటి వైరస్ లేదని చెప్పారు. 9 హార్డ్ డిస్క్ లు మాత్రం వాడటంలేదని, వాటిని తీసివేసినట్లు డాక్టర్ పరకాల తెలిపారు.