1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:54 IST)

కన్న కొడుకే... అయినా కడతేర్చారు.. శ్రీకాళహస్తిలో దారుణం

కన్న కొడుకే.. తాము పెంచి పోషించిన బిడ్డే.. అయినా సరే కడతేర్చారు. ఎందుకలా..? ఏళ్ళ తరబడి అతను పెట్టే హింసను భరించారు. చేసే అరాచకాలను తట్టుకున్నారు. బుజ్జగించి చూశారు. ఎన్నో విధాలుగా చెప్పారు. అయినా అతడిలో మార్పు లేదు. ఇక వారికి ఓపిక నశించింది. వాడి బెడద తప్పితే చాలు అనుకున్నారు. దగ్గరుండి హతమార్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తొట్టంబేడు మండలం దిగువసాంబయ్య పాల్యంకి చెందిన మునికృష్ణ దంపతులు తమ కుమారుడు రాంబాబు (22)తో కలసి 10 ఏళ్ల క్రితమే తిరుపతిలో స్థిరపడ్డారు. మునికృష్ణ టీటీడీ సులభ్ కాంప్లెక్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కష్టపడి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొడుకు తాగుడుకు బానిసై వారిని హింసించే వాడు. 
 
దీనిని భరించలేక ఆదివారం దిగువ సాంబయ్యపల్లిలో ఉండే తన తండ్రి వద్దకు మునికృష్ణ, రాంబాబుతో కలసి వెళ్లాడు. సాయంత్రం తన తండ్రి పనిచేసే ఎంజీఎం క్రషర్ వద్దకు వెళ్లి వద్దామంటూ మునికృష్ణ తన కుమారుడ్ని వెంట తీసుకుని వెళ్లాడు. అర్ధరాత్రికి రాంబాబు అక్కడ శవమై కనిపించాడు. మరోవైపు యువకుడి తల్లిదండ్రులు... తామే కొడుకును హత్య చేయించామని శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.