శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 3 జులై 2019 (14:19 IST)

తల్లిదండ్రులూ ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే: పిల్లలకు బండి ఇస్తే? (Video)

ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు మరింత కఠినతరం కాబోతున్నాయి. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ప్రకారం చిన్నపిల్లల చేతికి వాహనాలిస్తే వారి తల్లిదండ్రులకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే 10 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. కేంద్ర మంత్రి వర్గం ఈ బిల్లును ఆమోదించింది, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 
 
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి వాతపెట్టే మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు ఇకపై రెట్టింపు కానున్నాయి. నిబంధనలు పాటించని వారి జేబుకు ఇకపై చిల్లు పడనుంది. 
 
కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే, పిల్లలు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు గానీ సంరక్షకులకు గానీ 25 వేల రూపాయలతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా సంరక్షకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అత్యవసర సర్వీసులకు, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
 
లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా వాహనం నడిపితే రూ.5000, ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.5000, హెల్మెట్‌ లేకుండా బండి నడిపితే రూ.1000 జరిమానా మాత్రమే కాకుండా మూడు నెలల పాటు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. రవాణా శాఖకు సంబంధించి ఏ ఆదేశాలనైనా ఉల్లంఘించినట్లు నిరూపితమైతే రూ.2000 వసూలు చేస్తారు. కాగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు భారీగా ఉంటాయి. కేంద్ర మంత్రి వర్గ ఆమోదం పొందిన ఈ కీలక మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.