బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:51 IST)

కరోనా చికిత్స వ్యయం భరించలేని స్థితిలో రోగులు

కరోనా చికిత్స వ్యయం భరించలేని స్థితిలో రోగులు అల్లాడిపోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆ లేఖ యధాతథంగా...
 
"భారమైన హృదయంతో, తీవ్ర వేదనతో ఈ లేఖ మీకు రాస్తున్నాను. రాష్ట్రంలో కరోనా వైరస్  ప్రారంభం నుంచి, కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము సూచిస్తున్నాం. కానీ మా సలహాలు, సూచనలను ప్రస్తుత ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, పర్యవసానంగా  కోవిడ్ వైరస్ విజృంభించడం, రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందడాన్ని చూస్తున్నాం.  ఈ రోజుకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలను దాటిపోవడం, అయినా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటం శోచనీయం.
 
కోవిడ్ కేసుల సంఖ్యలో  దేశంలో 2వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరింది. జనాభా పరంగా చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కోవిడ్ కేసుల పరంగా అందుకు విరుద్దంగా పెద్ద రాష్ట్రం అయ్యింది. కోవిడ్ కేసుల పెరుగుదల రేటులో బంగ్లాదేశ్, స్పెయిన్, యుకె, అర్జెంటీనా తదితర దేశాలను కూడా ఆంధ్రప్రదేశ్ అధిగమించింది.

1 మిలియన్ జనాభాకు 7,729 కరోనా కేసులతో, ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక కేసుల సంఖ్యతో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రతి జిల్లా 15 వేల కేసులను అధిగమించగా, కరోనా మరణాలల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో  కొన్ని  సమస్యలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తెస్తున్నాను.
ఫ్రంట్‌లైన్ వారియర్స్ ను కాపాడుకోవడం..

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్ల( వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మునిసిపల్ ఉద్యోగుల..) ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం. వాళ్లందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) అందించడమే ముఖ్యం కాదు, ఎక్కువ గంటలు పని చేయాలని వాళ్లను వేధింపులకు గురి చేయరాదు. 

వాళ్లందరికీ తగిన విశ్రాంతి లభించేలా చూడటం అత్యంత అవసరం. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్ల కుటుంబ సభ్యులకు భద్రతా వలయం కల్పించేందుకు, వాళ్లందరికీ  సరైన ఆరోగ్య సౌకర్యాలు, ఆర్థిక భద్రత కల్పించడం కూడా అంతే అవసరం. సమాజ హితం కోసం చేస్తున్న ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకు కనీసం రూ 50లక్షలు ఆర్ధిక సాయం తక్షణమే అందించాలి. 
 
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో ఆశా  వర్కర్లే  మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వెన్నెముక.  ఉన్నతాధికారులు వారిని వేధిస్తున్నట్లుగా అనేక కథనాలను బట్టి తెలుస్తోంది. ఫ్రంట్ లైన్ లో పని చేసే ఆశా వర్కర్లు కరోనా బారిన పడకుండా, వారి యోగక్షేమాలు విస్మరించకుండా ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన ఆశావర్కర్ల యోగక్షేమాలను గాలికి వదిలేయకుండా వారి భద్రతకు తగిన రిపోర్టింగ్ వ్యవస్థను నెలకొల్పేలా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఆదేశాలను జారీ చేయాలి.
 
అదే సమయంలో జనవరి 2020 నుండి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌లను చెల్లించాలని కోరుతూ మన జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులలో సహాయక యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే జూనియర్ డాక్టర్లను  నిరాశ పర్చడం మంచిది కాదు. అంతేకాకుండా నాసిరకం పిపిఇ కిట్లపై, ఎన్ 95 మాస్క్ ల కొరత గురించి కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.

అత్యున్నత స్థాయిలో జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన అత్యంత కీలకాంశం ఇది. నాసిరకం పిపిఇ కిట్లు, అసలు కిట్లు అందుబాటులో లేకపోవడం  మన ఫ్రంట్‌లైన్ వారియర్ల ప్రాణానికే పెను ముప్పు.

పరీక్షా సరళిలో మార్పులు రావాలి..
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పెద్దఎత్తున పిలుపునిచ్చి, మరోవైపు అరకొరగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం గర్హనీయం. ఇటీవలనే 2020 ఆగస్టు 27న రాష్ట్ర ప్రభుత్వం 22,056 యాంటిజెన్ పరీక్షలను జరిపింది. రాష్ట్రంలో యాంటిజెన్ పరీక్షలకు బదులుగా, 100% ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించడం ప్రస్తుతావసరం.

యాంటిజెన్ పరీక్షల యొక్క ఖచ్చితత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్న నేపథ్యంలో, కరోనా బారినుంచి గట్టెక్కాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలను మరింత ఎక్కువ సంఖ్యలో నిర్వహించడంపైనే మన దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన మౌలిక సదుపాయాలతో మరిన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి.

హోమ్ ఐసొలేషన్ (గృహ ఒంటరితనం)పై ప్రభుత్వం పదేపదే ఒత్తిడి చేయడం మాటేమోగాని, దాని మార్గదర్శకాలపై తీవ్ర గందరగోళం చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ (గృహ నిర్బంధంలో) లేదా ఐసొలేషన్ లో ఉన్న ప్రతి రోగిని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక నిర్వాహక విధానాలు మరియు మార్గదర్శకాలను అత్యవసరంగా సిద్ధం చేయాలి.

ఒక ఆక్సిమీటర్, ఒక కిట్ (అవసరమైన మందులు, ఔషధాలతో)ను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న ప్రతి కోవిడ్ పాజిటివ్ రోగికి అందించడంతో పాటుగా, ఎప్పటికప్పుడు హెచ్చరించే యంత్రాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అటువంటి రోగుల్లో భయాందోళనలను తగ్గించి, కావాల్సిన తోడ్పాటు అందించడంపై  తప్పనిసరిగా దృష్టిపెట్టాలి. ఏమేమి చేయాలో సూచించడం మాత్రమే కాదు, వాటిని ఎలా చేయాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించాలి.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరైన సౌకర్యాలు లేకపోవడం తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న  మరో ప్రధాన సమస్య. దీనివల్ల పేద, బలహీన వర్గాల ప్రజలు కోవిడ్ కు సరైన చికిత్సను పొందలేక పోతున్నారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ చికిత్సకు సరైన సౌకర్యాలను మెరుగుపర్చడం, మరింత సమర్ధంగా అందించడం తక్షణావసరం. టెస్టింగ్  నుండి ట్రీట్ మెంట్ వరకు కోవిడ్ చికిత్సకు సక్రమపద్దతిలో పూర్తి జాగ్రత్తలతో సార్వత్రిక కోవిడ్ ఆరోగ్య సంరక్షణ(యూనివర్సల్ కోవిడ్ హెల్త్ కేర్)ను పాటించాల్సిన ఆవశ్యకత ఉంది.

సరైన వైద్య చికిత్స పొందే హక్కు మన ప్రజలందరికీ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్స కోసం తాత్కాలిక క్వారంటైన్ కేంద్రాలను, తాత్కాలిక ఆసుపత్రుల విస్తృతికి మిషన్ మోడ్‌లో కృషి చేయాల్సిన అవసరం ఉంది. కరోనాతో బాధపడే రోగులకు అందించే అన్ని చికిత్సలలో ఆసుపత్రులు, వైద్యులు, ఫార్మా కంపెనీలు వంటి ప్రైవేట్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి.  భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సరైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ది కోసం, ఈ కోవిడ్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశంగా తీసుకోవాలి.

జిల్లా స్థాయిలో జరుగుతున్న పడకల కేటాయింపు కూడా సక్రమంగా లేదు. పడకల అసమతుల్యత తోపాటు అత్యధిక సమయం తీసుకునే ప్రక్రియ ఇది. తత్ఫలితంగానే, అరగంటలో బెడ్ కేటాయించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులలో రియల్ టైమ్ బెడ్ అవైలబులిటి(సకాలంలో పడకల లభ్యత) తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచితే, ప్రజలే నేరుగా సంప్రదించి ఆసుపత్రుల్లో ప్రవేశం పొందగలరు.

ఆరోగ్య మౌలిక సదుపాయాలను పకడ్బందీగా అభివృద్ది చేస్తే వాటిని మరింతగా సద్వినియోగం చేసుకునే వీలు ఉంటుంది. మందులు, ఆహారం, నీరు, నిరంతరాయ విద్యుత్ తదితర పూర్తి సదుపాయాలన్నీ క్వారంటైన్ కేంద్రాలు అన్నింటిలో ఉండేలా చూడాలి.  

కోవిడ్ చికిత్సా వ్యయం భరించలేనిదిగా మారింది
కరోనాకు ప్రభుత్వ పరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోవడం వల్ల, కోవిడ్ వైరస్ బారిన పడిన అనేక మంది ప్రజలు కోవిడ్ చికిత్సా వ్యయాన్ని భరించే స్థితిలో లేరు. కరోనా చికిత్సకు రూ. 4 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో సామాన్య ప్రజానీకం, పేద, మధ్యతరగతి ప్రజలు ఈ చికిత్సా వ్యయాన్ని భరించలేక పోతున్నారు. కోవిడ్ చికిత్సకు అయ్యే అత్యధిక వ్యయాన్ని తగ్గించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  చర్యలు చేపట్టాలి.

మన రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు తగిన సదుపాయాలు లేక పోవడం వల్లే కోవిడ్ రోగుల్లో అత్యధికులు చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. వివిధ దశల్లో చికిత్సకు రేట్లను రోజుకు రూ. 3,250 నుంచి రూ 10,380 వరకు రాష్ట్ర ప్రభుత్వమే  నిర్ణయించింది . అయితే కొన్ని ఆసుపత్రులు జీవోఎంఎస్ 77 ను గాలికి వదిలేసి,  అత్యధిక రేట్లను వసూళ్లు చేస్తున్నాయి.

కొన్ని ఆసుపత్రులు రోజుకు రూ 70,000 చొప్పున వసూలు చేస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలను బట్టి తెలుస్తోంది. చేరేటప్పుడే కొన్ని ఆసుపత్రులలో కరోనా పేషంట్ల వద్ద  రూ. 50,000 నుండి రూ. 1,00,000 డిపాజిట్ చేయిస్తున్న దృష్టాంతాలు ఉన్నాయి.

జీవనోపాధిని,  ఉద్యోగాలను కోల్పోవడం..
కరోనా ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి ముప్పు తేవడమే కాకుండా మరోవైపు లాక్ డౌన్ లు, కరోనా భయం కారణంగా రాష్ట్రంలో అనేకమంది జీవనోపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా చికిత్సకు అత్యధిక ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఉపాధిని కోల్పోయి, పొదుపు చేసుకున్న సొమ్మును కూడా వైద్యానికే ఖర్చు చేయాల్సి రావడంతో రెండిందాలా ప్రజానీకానికి పెనుముప్పుగా కరోనా పరిణమించింది. అటు ఆరోగ్యంపై, ఇటు జీవనోపాధి-ఉద్యోగాలపై, పొదుపుపై మూడు రంగాల్లోనూ ప్రజలపై కరోనా ముప్పేట దాడి చేసింది.

దీనితోపాటు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి రావడంతో వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో   చిక్కుకోవాల్సిన దుస్థితి ప్రజలకు దాపురించింది.  ప్రభుత్వం ద్వారా ఉచిత చికిత్స చేయిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చకుండా, ప్రజలకు ద్రోహం చేయడమే కాకుండా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయేలా చేశారు.

కరోనా కారణంగా లాక్ డౌన్ ల వల్ల సంఘటిత,  అసంఘటిత రంగాలలో అన్ని వర్గాల ప్రజల జీవనోపాధిని దారుణంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవనోపాధి కోల్పోయిన వారిని సత్వరమే ఆదుకోవాలి.  కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం,  జీవనోపాధి లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం అష్టకష్టాలు పడుతోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో, జీవనోపాధి సాయం కింద ప్రతి పేద కుటుంబానికి రూ 10,000 చొప్పున అందించాలి. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలు అన్నింటికీ 2020 ఏప్రిల్ నుండి నవంబర్ దాకా, జీవనోపాధి నిమిత్తం భత్యం ఇవ్వాలి, ఆయా కుటుంబాలలోని మహిళల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి. రాష్ట్రంలో కోలుకున్న ప్రతి రోగికి రూ  2 వేలు ఇస్తామన్న హామీ అమలు కావడం లేదు. హామీ ఇచ్చిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి నడిపించాలి.

భయంకరంగా పెరుగుతోన్న కేసుల సంఖ్యలే హెచ్చరిక చిహ్నాలు. సమర్ధమైన పరిష్కారాలను అందించడంలో, ప్రజావసరాలను తీర్చడంలో ఇతోధికంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే విశ్వసనీయ నాయకత్వం, ఖచ్చితమైన ప్రణాళిక, నిర్ణయాత్మక చర్యలే కాకుండా, ప్రజల పట్ల సుహృద్భావం ఉండాలి. ఈ సంక్షోభ సమయంలో సమర్థవంతమైన వ్యూహాలు, సరైన పరిష్కారాల ద్వారా ప్రజల్లో విశ్వాసం  పెంచాల్సినదిగా రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

రాష్ట్ర ప్రభుత్వ చురుకైన పాత్ర ద్వారానే కోవిడ్ ప్రతికూల ప్రభావాల నుండి రాష్ట్రం కోలుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రెండు అంశాలపై ఆరోగ్యం,  ప్రజల జీవనోపాధిపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలి. కరోనా ముప్పుపై కలిసికట్టుగా పోరాడటం ఈ క్లిష్ట సమయాల్లో మనందరి సమిష్టి బాధ్యత. తీవ్రంగా సతమతం చేస్తున్న అంశాలైన ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి గురించి ప్రాధాన్యతా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.