శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:55 IST)

పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల్లో మొద‌టిరోజు గురువారం పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు.

ఆ తరువాత కంక‌ణ‌బ‌ట్టార్ వేంప‌ల్లి శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాదిమండల పూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. మధ్యాహ్నం పద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ కారణంగా తిరుప్పావ‌డ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి. కాగా, ఈ నెల 13న పవిత్ర సమర్పణ, 14న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750 చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమ‌తిగా అందజేస్తారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ కోలా శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.