కరోనా రెండో దశ వ్యాప్తి భయం కలిగిస్తోంది... అప్రమత్తంగా ఉండాలి : పవన్
కరోనా వైరస్ బారినపడిన జనసేనాని పవన్ కల్యాణ్ తన ఫాంహౌస్‌లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తన క్షేమం కోసం అన్ని వర్గాల వారు సందేశాలు పంపారని, అభిమానులు, జనసైనికులు ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేశారని... అలాంటి వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనే పదాలతో తన భావోద్వేగాలను వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. అందరూ తన కుటుంబ సభ్యులేనని ఉద్ఘాటించారు
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏపీలో 7 వేలు, తెలంగాణలో 4 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
అయితే, కేసుల తీవ్రతను అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
బెడ్స్ కొరతతో కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంలేదని, చికిత్సలో ఉపయోగించే మందుల కొరత ఏర్పడిందని వివరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.