1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (19:59 IST)

జనసేన పార్టీకి రూ.10 కోట్ల విరాళాన్ని అందించిన పవన్ కళ్యాణ్-Video

pawan kalyan - nagababu
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనకు ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. ఎన్నికల సమయం కావడంతో ఆ పార్టీ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఆయన చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నేతలు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చిన తీరు గొప్పదని ఆయన కొనియాడారు. 
 
ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్‌ను సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇపుడు ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నాను. ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. 
 
జనసేన పార్టీ కోసం ఓ సగటు  కూలీ తన చిన్నపాటి సంపాదనలో రూ.100 పక్కనబెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నాడు. ఓ బేల్దారీ మేస్త్రీ రూ.లక్ష విరాళం అందించారు. దాంతోపాటు పింఛను డబ్బులో కొంత మొత్తాన్ని పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తన వంతు సాయం అందిస్తున్నాను అని పేర్కొన్నారు. 
 
అలాంటి వారి స్ఫూర్తితో తాను సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎఁతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని తెలిపారు.