ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల పౌరుషంపై స్పందించారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయాలని లేనిపక్షంలో ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో మంగళవారం విజయవాడ వేదికగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అన్యాయంగా విభజించారన్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని సూచించారు. ఎవరు ఎన్ని చెప్పినా... రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం మాత్రం వాస్తవమని చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇవ్వాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో రాష్ట్ర కోసం మాజీ ఎంపీ ఉండవల్లి చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. ఎప్పుడో జరిగిపోయిన విభజన గురించి ఉండవల్లి ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని... భవిష్యత్తు తరాల కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండటం సరికాదని... మనం మౌనంగా ఉంటే ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారని చెప్పారు.
ఇపుడు ఎవరు ఏ లెక్కలు చెప్పినా.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అందువల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలన్నారు. ఇప్పుడు గొంతెత్తకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతారన్నారు. ఉండవల్లి ప్రవేశపెట్టిన తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.