ఏపీలో గంజాయి సాగు సామాజిక ఆర్థిక అంశం : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు నిజంగానే సామాజిక ఆర్థిక అంశంగా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన బుధవారం వరుస ట్వీట్లు చేశారు. 'విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధిలేని, చదువు పూర్తయిన, కుర్రాళ్ళు ఈ ట్రేడ్‌లో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు'.
'మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అపుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు'.
'ఆ పని వదిలి, బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు. ఇక్కడ సీజ్ చేసినదాని కంటే, రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటుంది' అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.