గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (14:53 IST)

పవన్ మాట - రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట : మాట నిలబెట్టుకున్న జనసేనాని.. తొలి సంతకం అదే..

pawankalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన మాట మేరకు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. 
 
ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దానికంటే ముందుగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సచివాలయంలోని తన చాంబర్‌కు వచ్చిన ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. 
 
కాగా, ఏపీ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు, నాదెండ్ల భాస్కర్ రావు, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ళ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రసాద్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తదితరులు పాల్గొన్నారు. 
 
గత 2019లో ఆయన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురస్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది అని  2019 మహిళా దినోత్సవం రోజున ఆయన జనసేనాని మాట ఇచ్చారు. ఇపుడు ఆ మాటను ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే నిలబెట్టుకున్నారు.