సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (08:55 IST)

'వై నాట్ 175' గొంతులు మూగబోయాయి : పయ్యావుల కేశవ్

payyavula
ఏపీలో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వై నాట్ 175 అనే గొంతులు మూగబోయాయని ఏపీ రాష్ట్ర ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీనిపై పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, పులివెందుల నుంచి తెదేపా ఎమ్మెల్సీ గెలిచారని త్వరలో ఎమ్మెల్యే కూడా తెదేపా నుంచే గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 
 
వైకాపా నిఘంటువులోనే లేని ప్రజలు, ప్రజాసామ్యం అనే పదాలను సకల శాఖామంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలుకుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక్క షాకుతో ఆయనకు అధికారంలో ఉన్నామా? అనే అనుమానం రావడం శుభ పరిణామమేనని వ్యాఖ్యానించారు. మాస్కు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్టు చేయడం వరకు చట్టాన్ని బుల్డోజ్‌ చేశారని పయ్యావుల వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారని మండిపడ్డారు. 'ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా మా సంఖ్యా బలం 23. మా ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు?' అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెదేపా బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు.