సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (23:09 IST)

భారత్ బంద్‌కు మద్దతు.. బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీ: పేర్ని నాని

భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న బంద్‌కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతోన్న బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంటును మేం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందన్నారు.
 
ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయని, గత ప్రభుత్వంలో ఇసుక పంచాయతీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సర్దుబాటు చేసేవారని విమర్శలు వచ్చాయని అన్నారు. ఇసుక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా రూ. 765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తోందని, గత ఐదేళ్ల కాలంలో ఈ మొత్తం ఎక్కడికి పోయింది..? అని పేర్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు.