ఇద్దరు పిల్లల తల్లితో కానిస్టేబుల్ సహజీవనం, పెళ్ళి చేసుకోమన్నందుకు..?
పెళ్ళిచేసుకుంటానని నమ్మించాడు. మగ దిక్కులేని ఆ మహిళను లోబరుచుకున్నాడు. శారీరకంగా అనుభవించాడు. పెళ్ళి చేసుకోమంటే మాత్రం ముఖం చాటేశాడు. దీంతో ఆ మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాలో ఘటన జరిగింది.
మదనపల్లెకి చెందిన సుగుణకి ములకలచెరువు మండలం పెద్దయ్యగారిపల్లికి చెందిన రమణారెడ్డితో వివాహమైంది. పెళ్ళయిన కొన్నేళ్ళకే మనస్పర్థలు తలెత్తడంతో భర్త వదిలేశాడు. దీంతో ఆమె మదనపల్లెలోని గౌతమీనగర్‌లో బ్యూటీపార్లర్ పెట్టుకుని ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది.
జైళ్ళ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కర్నూలు ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ బదిలీపై మదనపల్లెకి వచ్చాడు. చంద్రకాంత్‌తో సుగుణకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. తనకు వివాహం కాలేదని.. నిన్నే పెళ్ళి చేసుకుంటానని కానిస్టేబుల్ నమ్మించాడు.
ఆమెను లొంగదీసుకున్నాడు. అయితే కానిస్టేబుల్ ఎంతకూ తనను పెళ్ళి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైంది సుగుణ. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటున్నట్లు కానిస్టేబుల్‌కు ఫోన్ చేసింది. అతను వచ్చేలోపే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
కానిస్టేబుల్ కిందకు దింపి చూసేసరికి సుగుణ చనిపోయింది. చంద్రకాంత్ కారణంగానే తన కుమార్తె చనిపోయిందని సుగుణ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.