శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (11:28 IST)

అనంతపురంలో పవన్ కవాతు : జనసైనికుల నివాసాల్లో పోలీసుల సోదాలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణంలో జనసేన కవాతు, బహిరంగ సభ జరుగనుంది. ఇందుకోసం జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున జనసేన సైనికులు తరలివస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు అర్థరాత్రిపూట రంగంలోకి దిగారు. 
 
ఇందులోభాగంగా, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 5 గంటలకు పోలీసుల సోదాలకు దిగారు. స్థానిక జనసేన పార్టీ నాయకుడు రేగాటిపల్లి చిలకం మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈ సోదాలు చేశారు. 
 
ఆదివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలో కవాతు, భారీ బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో కవాతుకు, భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తున్న సమయంలో ఓర్వలేని అధికార పార్టీ నాయకులు పోలీసులచే సోదాలు చేయడం దారుణమన్నారు. 
 
గత 15 సంవత్సరాలుగా ప్రశాంత జీవనం, ప్రజల కొరకు ప్రజాసేవకే అంకితమైన తనలాంటి వ్యక్తుల ఇళ్ళల్లో పోలీసులు సోదాలు చేయడం చాలా బాధాకరమన్నారు. మన ధర్మ సేవా ట్రస్టు నిర్మించి మతాలకతీతంగా వందలాది నిరుపేదలకు పెళ్లిళ్ళు చేస్తున్న తమ ఇంట్లో పోలీసుల సోదాలు చేయడం ప్రజలందరూ చూస్తున్నారన్నారు. 
 
ఫ్యాక్షన్ గ్రామం రేగాటిపల్లి అని అంటుంటారు కానీ అలాంటి గ్రామాన్ని ప్రశాంతమైన గ్రామంగా, ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో గ్రామంలోని తమ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం మనసు కలిచివేస్తుందన్నారు. ఏది ఏమైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సభకు ఖచ్చితంగా వెళ్లి తీరుతామన్నారు. 
 
పోలీసుల చర్యలకు భయపడి వెనుకడుగు వేయబోమని, పార్టీని కాపాడుకుంటామన్నారు. పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. ఇలాంటి దాడులకు, సోదాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎంతమంది వచ్చి ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన పేద ప్రజల అభివృద్ధికి ఎంతవరకైనా, ఆఖరుకు తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడుతానన్నారు.