సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (17:07 IST)

తెలంగాణ సర్కారుకు షాక్ : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు వేసింది. 
 
ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఆర్టీసీ రూట్ల  ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. 
 
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వాదన పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు ప్రకటించింది. అప్పటివరకు రూట్ల ప్రైవేటీకరణ స్టే విధించింది. 
 
మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం తాము చేపట్టిన పోరాటం ఆగదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అలాగే, ఆర్టీసీ జేఏసీ శనివారం చేపట్టనున్న చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణలో హైకోర్టు సీరియస్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఐఏఎస్‌లను కోర్టులో నిలబెట్టిన ఘనత తెలంగాణదేనని చెప్పారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఆత్మ గౌరవం, స్వయంపరిపాలన అన్నారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవిధంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.