1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:16 IST)

రేపిస్టు రాజు మృతిపై అనుమానాలు... హైకోర్టులో పిల్​!

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజుది ఆత్మహత్య కాదని, కస్టోడియల్ మరణంగా అనుమానం ఉందని పేర్కొంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పిల్ వేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు ఈ పిల్ ను విచారించనుంది.
 
చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. ప్రభుత్వం అసలు స్పందించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వారమవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోలేదని, ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడు వేషాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడంటూ పోలీసులు వెల్లడించారు.
 
ఈ నేపథ్యంలోనే నిన్న వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ లక్ష్మణ్ పిల్ వేశారు.