శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (18:26 IST)

జగన్ కు పుదుచ్చేరి మంత్రి మద్దతు.. ఎందుకో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు.

తాళ్ళరేవు మండలం పరిధిలోని జార్జి పేట పంచాయతీ ఎం ఎల్ కె నగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాల అభివృద్ధే ద్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటు లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఒడి పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిని అభినందించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఓటు కి నోటు అనే సంస్కృతిని పూర్తిగా రూపుమాపాలని తెలియజేశారు.

అదేవిధంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా నిజాయితీగా, నిస్వార్ధంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని కోరారు. అతి తక్కువ కాలంలోనే ప్రజలకిచ్చిన ప్రధాన హామీల్లో నవరత్నాలు పథకాన్ని 80 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ముందుగా వైకాపా రాష్ట్ర నాయకులు కుడుపూడి శివన్నారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ 1.60 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన కళా వేదిక ను ఎమ్మెల్యే పొన్నాడ ప్రారంభించారు.